మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 28, ఈనెల 12వ తారీఖున ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చెయ్యలేదంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందనటువంటి పరిస్థితి నెలకొందని, యూనిఫామ్ పంపిణీ చేయలేదని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేక పోతున్నారని అన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు కోరినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని తెలిపారు. తక్షణమే ఆ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రధానంగా ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్, టై, బెల్ట్ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని, దీనిపై ప్రభుత్వము జీవో నెంబర్ ఒకటిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన విన్నతి పత్రాన్ని ఎం ఐ ఎస్ నిరోషా కు అందజేశారు. ఈ సందర్భంగా నిరోషా మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బోడ అభిమిత్ర, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి జెమ్మి యశ్వంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.