మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు పట్టాలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని సుగుణా గార్డెన్స్ లో ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30వ తేదీన పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లాకు చెందిన పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజక వర్గానికి 500 చొప్పున మొత్తం 2500 మంది లబ్ధిదారులకు శుక్రవారం పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా మొత్తం మీద 50 వేల 595 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుంచి లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. పోడు పట్టాలు పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. పోడు పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారులను గ్రామ స్థాయి నుండి మొబలైజ్ చేయాలని చెప్పారు. లబ్ధిదారులు తరలించేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపిఓలు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి పోడు పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారులను మొబలైజ్ చేయాలని చెప్పారు. ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు,ఎంపిపిలు
కార్యదర్శులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి సీఈఓకు సూచించారు. ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని ఉద్యాన అధికారికి సూచించారు. పట్టాలు జారీలో క్రమ పద్దతి పాటించాలని, రద్దీ లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హాలులో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోడు పట్టా పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులు క్యూ పాటించేందుకు వీలుగా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు నియోజక వర్గాల వారిగా మండలాల
కౌంటర్లు, సైనేజీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు.భోజనాల వద్ద రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ఐడిఓసి కార్యాలయంలో హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ర.భ. అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జడ్పి సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఆర్ అండ్ బి డిఈ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఏవో గన్యా, పాల్వంచ
తహసీల్దార్ రంగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.