మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 30, మండల పరిధిలోని అర్హులైన నిరుపేదలందరికీ స్థలంతో పాటు, పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక, సిఐటియు మండల నాయకులు యాస నరేష్ ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ మండలంలో అనేక మందికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఏమి పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఇలానే కొనసాగితే ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి, ఆ భూమిని పేదలకు పంచి పెడతామని హెచ్చరించారు. పేదలు ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెలను కొంతమంది అక్రమార్కులు చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల భూమి కోసం జైలుకు వెళ్లటానికైనా సిద్ధమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతోపాటు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా పోడు కొట్టిన ప్రతి ఒక్కరికి పోడు భూమి పట్టాలి ఇవ్వాలని కోరారు. పోడు భూముల పోరాట ఫలితం ఎర్రజెండాదే అని గుర్తు చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గడిదెసి కనకరత్నం, బానోత్ ఇస్ర, లకావత్ శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పద్దం సుగుణ, తాటి పద్మ, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ మధు, కెవిపిఎస్ మండల నాయకులు గార్లపాటి వెంకటి, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వలమల చందర్రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.