హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. జులై 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఇది.
ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఈ సభను నిర్వహించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. లక్షలాదిమందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార భేరిని మోగించనుంది కాంగ్రెస్.
తెలంగాణ జనగర్జన ఏర్పాట్లను తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భారత్ రాష్ట్ర సమితి నాయకుల గుండెలు అదిరేలా జన గర్జన సభను నిర్వహించబోతోన్నామని అన్నారు. ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సభను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బస్సులు అడిగితే ప్రభుత్వం ఇవ్వట్లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,500 బస్సుల ద్వారా జనాలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామిన పేర్కొన్నారు. రెండు కోట్ల రూపాయల అద్దె కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ- ప్రభుత్వం అంగీకరించట్లేదని విమర్శించారు.