రెండు నెలలుగా స్ధానిక తెగల మధ్య విభేదాల నేపథ్యంలో అడ్డుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఇవాళ మరో హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటికే మణిపూర్ లో ఘర్షణలు నియంత్రించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మీద ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఆయన ఇవాళ రాజీనామాకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖ తయారు చేసి గవర్నర్ కు ఇచ్చేందుకు బయలుదేరారు. అంతలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియడంతో మద్దతుదారులు ఆయన నివాసం బయట భారీగా గుమికూడారు. చివరికి ఆయన గవర్నర్ కు ఇచ్చేందుకు తయారుచేసుకున్న రాజీనామా పత్రాన్ని చించేశారు. దీంతో ఆయన రాజీనామా ప్రతిపాదన ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా హైడ్రామాగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయదలిస్తే ఇదంతా అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రధాని మోడీ మణిపూర్ కు రాకపోవడాన్ని తప్పుబడుతున్న రాహుల్.. ఇవాళ తాను స్వయంగా మణిపూర్ కు వచ్చి పరిస్దితిని సమీక్షించారు. గవర్నర్ ఉయికేతో సమావేశం అయ్యారు. అలాగే స్ధానిక తెగలతో, ప్రజాసంఘాలతో సమావేశమై తాజా పరిణామాల్ని అడిగి తెలుసుకున్నారు.