UPDATES  

 కోరమాండల్ ప్రమాదానికి `ఆమె`ను బాధ్యురాలిని చేసిన కేంద్రం- బదిలీ వేటు

న్యూఢిల్లీ: దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 293 మరణించారు.

1,100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ 81 మృతదేహాలు బాలాసోర్‌లో ఉన్నాయి. ఆ మృతదేహాలు తమ వారివేనంటూ పలువురు రావడం వల్ల వాటిని అప్పగించే ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటోంది.

డీఎన్ఏ పరీక్షలను నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పారాదీప్ పోర్ట్ నుంచి తెప్పించిన నాలుగు కంటైనర్లలో భద్రపరిచారు. మృతుల వివరాలు, కుటుంబ సభ్యులు తెలియజేసే సమాచారాన్ని క్రోడీకరిస్తోన్నారు. అదనంగా డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి, అవి సరిపోలిన తరువాతే వాటిని అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలపై పడిన కోరమాండల్ రైలు బోగీలను ఢీ కొట్టింది.

కాగా- ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా పలువురు ఆగ్నేయ రైల్వేకు చెందిన సీనియర్ అధికారులు, టెక్నికల్ సిబ్బంది, స్టేషన్ మేనేజర్లు.. ఇలా చాలామందిని సీబీఐ అధికారులు విచారించారు.

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషిపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో ఆమెపై చర్యలకు దిగింది. బెంగళూరులోని యలహంకలో గల రైల్వే వీల్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా బదిలీ చేసింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే కొందరు సీనియర్ అధికారులకు స్థానచలనం కల్పించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !