UPDATES  

 ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్: రష్యాలో తిరుగుబాటు, కీలక అంశాలపై చర్చ

న్యూఢిల్లీ/మాస్కో: భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేశారు. రష్యాలో తిరుగుబాటు తర్వాత మోడీకి పుతిన్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉక్రెయిన్ పరిస్థితులు, మాస్కో సాయుధ తిరుగుబాటు గురించి కీలకంగా సంభాషించుకున్నట్లు తెలిసింది. గత శనివారం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ తిరుగుబాటును నియంత్రించేందుకు రష్యా నాయకత్వం నిర్ణయాత్మక చర్యలకు ప్రధాని మోడీ మద్దతు తెలిపారని క్రెమ్లిన్ తెలిపింది.

‘రష్యాలో జూన్ 24 నాటి సంఘటనలకు సంబంధించి, శాంతిభద్రతలను పరిరక్షించడానికి, దేశంలో స్థిరత్వం, పౌరుల భద్రతను నిర్ధారించడానికి రష్యా నాయకత్వం నిర్ణయాత్మక చర్యలకు నరేంద్ర మోడీ అవగాహన, మద్దతును వ్యక్తం చేశారు’ అని క్రెమ్లిన్ పేర్కొంది.

 

ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించుకున్నారని, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నారని.. రష్యాలో ఇటీవలి పరిణామాలను పుతిన్ ప్రధాని మోడీకి తెలియజేసినట్లు ప్రధాని మోడీ కార్యాలయం తెలిపింది.

‘ఉక్రెయిన్‌లో పరిస్థితిని చర్చిస్తున్నప్పుడు, చర్చలు, దౌత్యం కోసం ప్రధాని తన పిలుపును పునరుద్ఘాటించారు’ అని పీఎంవో పేర్కొంది. కాగా, రష్యా సంవత్సరానికిపైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాశ్చాత్య ప్రపంచం పుతిన్‌కు వ్యతిరేకంగా పలు ఆంక్షలు కూడా విధించాయి.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO), G20లో తమ దేశాల సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, భారతదేశం అధ్యక్షుడిగా ఉన్న G20, అలాగే BRICS ఫార్మాట్‌లో సహకారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది’ అని ప్రకటన పేర్కొంది.

గత శనివారం నాడు యెవ్జెనీ ప్రిగోజిన్, అతని వాగ్నెర్ బృందం చేసిన తిరుగుబాటు అధ్యక్షుడు పుతిన్‌కు రెండు దశాబ్దాలకు పైగా పాలనలో అత్యంత తీవ్రమైన సవాలుగా మారిన విషయం తెలిసిందే. పుతిన్ నాయకత్వంపై ప్రశ్నలను రేకెత్తించింది. అయితే, బెలారస్ జోక్యంతో తిరుగుబాటు సద్దుమణిగింది. ఆ తర్వాత, తాము దేశ నాయకత్వాన్ని మార్చేందుకు తిరుగుబాటు చేయలేదని వాగ్నెర్ పేర్కొంది.

కాగా, ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని పేర్కొన్న విషయం తెలిసిందే. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిస్థితులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !