UPDATES  

 మేమొస్తే.. పాత రేట్లకే మద్యం అమ్ముతాం: పవన్

భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవ్వాళ ముగిసింది. జ్వరం వల్ల ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన- ఈ సాయంత్రం భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే అమలు చేయదలిచిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మంత్రులనూ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీని ఓడించి తీరాలంటూ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు.

సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చి మోసం చేశాడని ఆరోపించారు పవన్ కల్యాణ్. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పాత ధరలకే మద్యాన్ని విక్రయిస్తామని హామీ ఇచ్చారు. మద్యపానాన్ని ఎక్కడికక్కడే నిషేధించ వచ్చని చెప్పారు.

ప్రజలు కోరుకుంటేనే గ్రామాలు, వార్డులు, కాలనీల్లో సంపూర్ణ మధ్యపానాన్ని నిషేధిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం రేట్లను విపరీతంగా పెంచారని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని ఇష్టానుసారంగా విక్రయిస్తోన్నారంటూ మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీని అడ్డుగా పెట్టుకుని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారనంటూ ధ్వజమెత్తారు.

సమాజంలో సంపూర్ణ మార్పు కోసం జనసేన ఆవిర్భవించిందని, ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు. దశాబ్దకాలంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తోన్నామని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తాము ఎక్కడికి పారిపోవట్లేదని, మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని అన్నారు. ఈ దశాబ్దకాలం పోరాటం తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

తమ పోరాటం 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో కొనసాగుతోందని, అధికార పార్టీ నాయకులు సాగిస్తోన్న దోపిడీ వ్యవస్థకు ఎదురొడ్డి నిలుస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల వ్యవస్థలను వైసీపీ ఛిన్నాభిన్నం చేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. యువత, శ్రామిక, రైతు పేర్లను పార్టీలో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం వారికి ఏం చేసిందని ప్రశ్నించారు.

అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారని, ఒక్క కులమే అధికారం చలాయించాలనుకోవడం సరికాదని, ఒక కులమే రాజ్యాధికారం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ విమర్శించారు. క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాలంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !