UPDATES  

 శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే: మోడీ తీపికబురు చెప్పాలన్న కేటీఆర్

హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. మూసీ నదిపైనా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని తెలిపారు.

శనివారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ. 29.50 కోట్లతో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను ఆయన ప్రారంబించారు. కాగా, నార్సింగి వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ ఛేంజ్‌తో మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులతోపాటు లంగర్‌హౌస్, శంకర్ పల్లి నుంచి వచ్చే వారు ఓఆర్ఆర్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉండనుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మురుగునీటిని పునర్వినియోగించేలా పాలసీని తీసుకొస్తామని.. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందన్నారు. రద్దీ మేరకు సర్వీస్ రోడ్డును విస్తరించాలని సీఎం కేసీఆర్ తెలిపారని చెప్పారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఓఆర్ఆర్‌పై 120 కిలోమీటర్ల వరకు వాహనాల స్పీడు పెంచామన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు మంత్రి కేటీఆర్.

శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలో కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్ ఛేంజ్‌లు వస్తాయన్నారు. మూసీపై స్కైవే కూడా నిర్మిస్తామన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయించామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

మెహిదీపట్నంలో స్కైవాక్ కోసం రక్షణ మంత్రిని స్థలం అడిగామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని అడిగినా స్పందించలేదన్నారు. శామీర్‌పేట్-జేబీఎస్ స్కైవాక్ కోసం రక్షణ భూములు ఇవ్వాలని అడిగామన్నారు. భూములు కేటాయించి ప్రజలకు ప్రధాని తీపి కబురు చెప్పాలన్నారు. ఆగస్టులో హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !