మన్యం న్యూస్ చండ్రుగొండ, జులై 02 : మండల పరిధిలోని బెండాలపాడు, తిప్పనపల్లి గ్రామాలలో గిరిజనులు సకాలంలో వానలు కురవాలని, పంట పొలాల్లో వేసిన విత్తనాలు మొలవాలని, పల్లె పాడి పంటలతో కళకళలాడాలని, వ్యవసాయం కలిసి రావాలని, ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు. ఆదివారం గిరిజనులు బోనాలతో సాంప్రదాయ డప్పు నృత్యాలతో బయలు దేరి గ్రామంలోని బొడ్రాయికి, గ్రామం శివారులోని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో ఇలా బోనాలతో మొక్కులు చెల్లించటం ఆచారంగా వస్తుందని గిరిజనులు తెలిపారు. ఇలా మొక్కులు చెల్లిస్తే గ్రామదేవతలను శాంతిపబడతారని, అందువల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు.