ఆదివాసీ చట్టాల సవరణ జరుగితే కార్పొరేట్ వలసలు పెరుగుతాయి.
భూములు, ఖనిజ సంపద దోచుకోబడతాయి –
దళ కమాండర్ అశోక్ ద్వారా లేఖ విడుదల
మన్యంన్యూస్ ఇల్లందురూరల్ – ఏజెన్సీలో గిరిజన చట్టాలు పగడ్బందిగా అమలు చేయాలంటూ సీపిఐ ఎంఎల్ న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు అజ్ఞాత దళ కమాండర్ అశోక్ సోమవారం లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో.. పోడు సాగుదారులైనా ఆదివాసీలకు, ఇతర పేద అటవీ నివాసులకు పట్టాలిస్తామని తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదారుల నుండి 11 లక్షల 50 అప్లికేషన్స్ స్వీకరించి, 4 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టలివ్వటం రైతులను మభ్యపెట్టటమే అవుతుందని పేర్కొన్నారు. పోడు పట్టల పంపిణీలో భారీగా అవినీతి, అనేక అవకతవకలకు జరిగాయన్నారు. అవినీతి ద్వారా వచ్చిన సొమ్మును బిఆర్ఎస్ నాయకులు, అధికారులు, రెవెన్యూ, అటవీ సిబ్బంది పంచుకుంటున్నారని తెలిపారు. 8 లక్షల ఎకరాల కు పట్టాలు రాలేదనే సమస్య నుండి పేదలను పక్కదారి పట్టించెందుకే, గిరిజనేతర పేదలను పట్టాల పేరుతో బిఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. గిరిజన – గిరిజనేతరుల మధ్య పట్టాల పేరుతో చిచ్చుపెట్టే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ఆదివాసీ చట్టాలకు సవరణలు జరుగితే ఏజెన్సీలోకి దోపిడీదారులు, పెట్టుబడిదారుల వలసలు మరింతగా పెరుగుతాయని. ఈ పరిణామం ఆదివాసీల మనుగడను మరింత ప్రమాదంలోకి నెడుతుందనీ తెలిపారు. ఆదివాసీల చట్టాల మార్పుకోసం జరిగే కుట్రలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందనీ, ఆదివాసీల పక్షాన దృఢంగా నిలబడుతుందని స్పష్టం చేసారు. అటవీ సంరక్షణ నియమాలు- 2022 పేరుతో ఆదివాసి చట్టాలకు సవరణలు తెచ్చుటకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదనీ, సవరణలు అమలులోకి వస్తే కార్పొరేట్ కంపెనీలు అడవిలోకి యదేచ్చగా ప్రవేసించి, అడవిలోని భూములు, ఖనిజాలు, నీళ్లు ఇతర అటవీ సంపదలను దోపిడీ చేస్తారను పేర్కొన్నారు.ఆదివాసీలతో గిరిజనేతర పేదలు వివాద పడడం వలన ఆదివాసేతర పేదలకు కూడా నష్టం జరుగుతుందనీ అశోక్ లేఖలో పేర్కొన్నారు.