మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఇల్లందు మండలం కొమరారంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రదర్శన అనంతరం ధర్నా నిర్వహించారు. పివైఎల్ రాష్ట్ర నాయకులు మోతిలాల్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో చెత్తా చెదారం పేరుకుపోయి సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను విరమింపచేసేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. పిహెచ్ సి వైద్యాధికారిణికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ శీను, బోయ తండా సర్పంచ్ బానోత్ సంతు, పివైఎల్ జిల్లా నాయకులు జోగ కృష్ణ, మాలు, తారాచంద్, రవి, మండల నాయకులు నాగేష్, సునీల్, రామ్ చంద్ పాల్గొన్నారు.