మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చిన్న చిన్న ఫంక్షన్ల పేరుతో తమ గొప్పల కోసం హంగు ఆర్భాటాలతో లక్షల రూపాయలను వృధా ఖర్చు చేస్తున్న నేటి యుగంలో, తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఓ తండ్రి చిరు కానుకలను అందజేశారు. మండల పరిధిలోని ఎనక తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నరసింహ తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి ఉద్యోగి, చిట్టి రామవరం గ్రామానికి చెందిన తన స్నేహితుడు, బి రాంబాబు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా మా కోరిక మేరకు బుధవారం ఎనక తండా ప్రభుత్వ పాఠశాలలోని సుమారు 30 మంది పేద విద్యార్థిని, విద్యార్థులకు షూ, టై, బెల్ట్ లను విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల చైర్మన్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కూతురి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదే విధంగా తమ పిల్లలకు సహాయం అందించిన బి రాంబాబుకు పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కూతురుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బాలకిషన్, ఎస్ఎంసి చైర్మన్ డి మోతిలాల్, వైస్ చైర్మన్ ఎల్ రవి తదితరులు పాల్గొన్నారు.