మన్యం న్యూస్, పినపాక:
గత సంవత్సరం వచ్చిన వరదలలో పూర్తిగా నష్టపోయిన చింతల బయ్యారం, టీ కొత్తగూడెం తదితర గ్రామాలను డీఎస్పీ రాఘవేంద్రరావు, తహసిల్దార్ ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, సిఐ రాజగోపాల్, ఎస్సై నాగుల్ మీరా పర్యటించి, పరిశీలించారు. రహదారితో సంబంధాలు లేని గ్రామాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ చేపట్టారు. అనంతరం స్థానిక అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందించాలని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. ముంపు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా మండలంలోని వరద ప్రభావిత గ్రామాలలో ఎటువంటి నష్టం జరిగినను తక్షణమే స్పందించి తహసిల్దార్ వారి కార్యాలయం, పినపాక నందు ఏర్పాటు చేయబడిన 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్:6301557027 గణపతిరావు కు సమాచారం అందించగలరని తహసీల్దార్ కోరారు. అనవసరంగా గోదావరి దాటే ప్రయత్నం చేయవద్దని చేపల వేటకు వెళ్ళవద్దని సిఐ రాజగోపాల్ తెలియజేశారు. వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు , రెవిన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.