మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) కోశాధికారి రాపర్తి ఎల్లయ్య నాచారం ఈఎస్ఐ హాస్పటల్లో గుండెపోటుతో గురువారం మృతిచెందారని, ఆయన మృతి యూనియన్ కు తీరనిలోటని టిపియండబ్ల్యూ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. రాపర్తి ఎల్లయ్య వయసు 55 సంవత్సరాలని, ఆయనకు ముగ్గురుపిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల అని అందరూ పన్నెండు సంవత్సరాలలోపు వయసుపిల్లలే అని పేర్కొన్నారు. పట్టణంలోని వినోబావేకాలనీలో ఉండే ఎల్లయ్య ఇల్లందు శానిటేషన్ విభాగంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుడిగా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని అన్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారని, యూనియన్ బలోపేతం కొరకు ఆయనపాత్ర మరువలేనిదన్నారు. కుటుంబాన్ని పోషించేవ్యక్తి చనిపోవడంతో కుటుంబం అనాధ అయిందని, మృతుని కుటుంబాన్ని మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఆదుకోవాలని కోరారు. మృతునికి జోహార్లు అర్పిస్తూ వారికుటుంబానికి, బంధుమిత్రులకు, తోటికార్మికులకు తనసంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.