మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 22, మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి మహిళల పై అమానుషంగా ప్రవర్తించి, మానవత్వాన్ని మరిచి నగ్నంగా ఊరేగిస్తూ, లైంగికంగా హింసించి హత్య చేసిన ఉన్మాదులను, కఠినంగా శిక్షించాలని కొమరం భీం ఫౌండేషన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, మణిపూర్ ముఖ్యమంత్రి భైరాన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. సరైన సమయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం వల్లే, మణిపూర్ అగ్నిగుండంలా మండిపోతుందని తెలిపారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తెలిసి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం, గిరిజన ఆదివాసి ప్రాణాలకు రక్షణ కల్పించకపోవడం, గిరిజనేతరులకు అనుకూలంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఫౌండేషన్ సభ్యులు బచ్చల లక్ష్మయ్య, పూనమ్ సూరయ్య, మలకం వీరభద్రం, మడి రవి, తెల్లం మహేష్, సిద్ధెబొయిన మోహన్, తాటి అరుణ్ కుమార్, అరెం రామయ్య పాల్గొన్నారు.