మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 22: కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపించడమే ధ్యేయంగా కార్యకర్తలు కృషి చేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు సాధించాలని, మొదట గెలిచేది అశ్వారావుపేట నియోజకవర్గం అని కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ కో చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా అశ్వరావుపేట ఆయన శనివారం వచ్చారు. పట్టణంలోని సత్య సాయిబాబా కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి సభలో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ నలుమూలల నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు మెడలో వేసి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల జులై రెండవ తేదీన జరిగిన జన గర్జన సభకు తరలివచ్చి జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని, తొమ్మిదన్నర సంవత్సరాల పాటు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని అన్నారు. అశ్వరావుపేటలో అనేకమంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని పాత కొత్త అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, సంభాని చంద్రశేఖర్, ఇంకా అనేకమంది నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని మీ అందరికీ భరోసా కల్పిస్తామన్నారు. పొంగులేటి శ్రీను అన్న అంటే ఏ ఒక్కరికో పరిమితమైన వాడు కాదని, శ్రీనన్న అందరివాడని కార్యకర్తలు అందరికీ అండగా ఉంటామని అన్నారు. జిల్లాలో మొట్టమొదటగా గెలవబోయేది అశ్వరావుపేట నియోజకవర్గమేనని, ఫలితాలు ఇప్పుడు కూడా ప్రకటించవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుందని, ఆసరా పెన్షన్ను 4000 కు పెరుగుతుందని, రైతన్నకు 24 గంటల కరెంటు నాణ్యంగా అందిస్తామని, రైతన్నకు భరోసా కల్పిస్తామని, రైతు డిక్లరేషన్ను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రామ రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన అందిస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పని చేసిందన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ ఇద్దరూ ఒకటేనని, ఏ టీం, బీ టీం కలసి సి టీం ని ఓడించాలని చూస్తున్నారని, సి టీం అంటే కాంగ్రెస్ పార్టీ అని ఎన్ని గ్రూపులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటూ, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఎక్కడికైనా వస్తా ఎప్పుడైనా వస్తా అంటూ కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, వగ్గెల పూజ, జూపల్లి రమేష్, మొగల్లపు చెన్నకేశవరావు, ఎంపీటీసీ వేముల భారతి, సత్య వరపు తిరుమల, బత్తుల అంజి, కేదార్నాథ్, అట్టం రమ్య నియోజకవర్గ నలు మూలల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.