– పేరుకుపోతున్న వరద నీరు
– అధ్వానంగా డ్రైనేజీ
– పట్టించుకోని మున్సిపల్ ఆర్ అండ్ బి
– ఆందోళనలో ప్రజానీకం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి ఎస్ ఆర్ టి సి బస్టాండ్ చౌరస్తా మూల మలుపుతో ప్రమాదం పొంచి ఉంది. ఈ మూల మలుపు వద్ద భారీగా వర్షపు నీరు పేరుకుపోయి ఉండడం వల్ల వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ పూడ్చుకుపోవడం వల్ల పేరుకుపోతున్న వరద నీరు డ్రైనేజీలోకి పోలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య ప్రతి ఏడాది వర్షాకాలం సమయంలో ఎదురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కొంతమంది సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత మార్గం సరిగా చూపడం లేదనే ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ చౌరస్తా సెంటర్లో వరద నీరు పేరుకుపోయి చెరువును సైతం తలపిస్తుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన నీటితో ప్రమాదం జరిగితే తప్ప అధికారులు సరైన రీతిలో స్పందించే పరిస్థితి కనబడడం లేదని పలువురు గుసాయిస్తున్నారు. ఈ మూలమలుపు వద్ద చిన్నపాటి గుడి సైతం ఉంది. గుడికి క్రమబద్ధీకరణ పైలాన్ మధ్యలో వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీనిని తొలగించేందుకు ఇటు మున్సిపాలిటీ వారికి ఆర్ అండ్ బి వారికి పట్టనట్లుగా ఉందని పలువురు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే బస్టాండ్ చౌరస్తాలో వర్షం వచ్చినప్పుడల్లా వరద నీరు నిల్వ ఉండకుండా గట్టి చర్యలు చేపట్టాలని వాహన పాదాచారుల వారు డిమాండ్ చేస్తున్నారు.