మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం అక్రమంగా కారులో తరలిస్తున్న సుమారు 30 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. భద్రాచలం వైపు నుండి, ఖమ్మం వైపుకు వెళ్తున్న కారులో గంజాయి రవాణా అవుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కారును వెంబడించి పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి రవాణాలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం, పట్టుబడ్డ కారును, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలను మంగళవారం పోలీస్ శాఖ వెల్లడించనున్నట్లు తెలిపారు.