* కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు
* వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో వనమా అవుట్.. జలగం ఇన్ అయ్యాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన జలగం వెంకట్రావుపై 4,139 ఓట్ల ఆధిక్యంతో వనమా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్
పార్టీలో చేరారు. అయితే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల, కేసులకు సంబంధించిన వివరాలను తప్పుగా
ఇచ్చినట్టు పేర్కొంటూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై నాలుగు సంవత్సరాలపైగా హైకోర్టు సుధీర్ఘ వాయిదాల పద్ధతిలో విచారణ జరిపి వనమా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదని 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు అనే తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదిలా ఉంటే కోర్టు తీర్పు ఆలస్యంగా వెలువడడంతో
జలగం వెంకట్రావు వర్గీయులలో కొంత నిరాశతో ఉన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉత్సాహంతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ హైకోర్టు వనమా విషయంలో సంచలన తీర్పు ఇవ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చ నియాంశంగా మారింది.
