మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని జూలూరుపాడు, వినోబా నగర్, నర్సాపురం తదితర ప్రభుత్వ పాఠశాలల్లోకి భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రజా ప్రతినిధులు కానీ, అటు ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో సమస్యలకు నిలయాలుగా పాఠశాలలు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నమంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. “మన ఊరు మనబడి”కార్యక్రమంలో మండల వ్యాప్తంగా మొదటి దశలో 17 పాఠశాలలను ఎంపిక చేసి, నిధులు కేటాయించినప్పటికీ, సంబంధిత పనులు నేటికీ పాఠశాలలో పూర్తి కాక అసంపూర్తిగా నిలిసి కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.