- మంచినీటి కోసం ఆదివాసుల పోరుయాత్ర
- పైప్ లైన్లు వేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు సరఫరా చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా.
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం కలివేరు గ్రామ పంచాయతీ రజబ్ అలి కాలనీ లో నివసిస్తున్న ప్రజలకు మిషన్ భగీరథ నీళ్ళు సరఫరా చేయాలని, రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో కలివేరు రజబలి కాలని నుంచి చర్ల ఎంపీడీవో కార్యాలయం వరకు ఆదివాసులు ఖాళీ నీటి బిందెలతో, ఎర్రజెండా చేతబట్టి సుమారు 12కి.మీ పాదయాత్ర నిర్వహించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు వందలాది మందితో ధర్నా నిర్వహించి ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు మాయం చేశారని విమర్శించారు. వెంటనే రజబ్ అలి కాలనీ కి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నీళ్ళు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆ గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఆదివాసులకు అండగా ఎప్పుడు సిపిఎం పోరాడుతుందని అన్నారు.పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలు వలస ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యురాలు జిలకర పద్మ, మండల కార్యదర్శి కారం నరేష్, జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు, తాళ్లూరి క్రిష్ణ, కొమరం కాంతారావు, మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, పొడుపుగంటి సమ్మక్క, బందెల చంటి, తాటి నాగమణి, బాలాజీ, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు .