- బుగ్గవాగుకు మహర్దశ
- 9 కోట్ల రూపాయలతో ఇల్లందు బుగ్గవాగు సుందరీకరణ
- ప్రజాప్రతినిధిగా మున్సిపాలిటీలో చైర్మన్ డీవీ చెరగని ముద్ర
మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణ నడిబొడ్డున గల బుగ్గవాగు ప్రక్షాళనకు రాష్ట్రప్రభుత్వం ద్వారా 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ డీవీ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ఇల్లందు పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని అన్నారు. గుంతల రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజల అవస్థలు, వర్షాకాలం రాగానే భయం గుప్పిట్లో బుగ్గవాగు ఆనుకుని నివసిస్తున్న ప్రజలు అనేక సమస్యలతో నిత్యం పలు ఇబ్బందులతోనే జేవిస్తుండేవారని కానీ నేడు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, మా పాలకవర్గం ఏర్పడిన అనతికాలంలోనే సెంట్రల్ లైటింగ్, తాత్కాలిక బుగ్గవాగు ప్రక్షాళన, మున్సిపాలిటీలో ప్రతిపని లంచానికి తావులేకుండా పారదర్శకంగా సాగడం, నూతనరోడ్లు, స్వచ్ఛ ఇల్లందు, హరితహరం తదితర అభివృద్ది పనులతో దేశస్థాయిలో, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులను పొంది రాష్ట్రానికే ఇల్లందు తలమానికంగా నిలిచిందన్నారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అందులో భాగంగానే నేడు బుగ్గవాగు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లందు ప్రజలు కంటున్న కలలు నెరవేర్చేందుకు ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అలుపెరగని కృషితో సీఎం కేసీఆర్, పురపాలక శాఖమాత్యులు కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల సహకారంతో ఇల్లందు బుగ్గవాగు ప్రక్షాళనకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 9కోట్ల రూపాయలతో బుగ్గవాగు చుట్టూత వాల్స్ నిర్మించేందుకు సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ నరసింహారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ లతో కలిసి గురువారం బుగ్గవాగును పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎన్నో దశాబ్దాల ఇల్లందు పట్టణ ప్రజల కల అయిన బుగ్గవాగు ప్రక్షాళన కార్యరూపం దాల్చినందుకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా చాలా సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇల్లందు పట్టణాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నా హయాంలో మా పాలకవర్గం అన్నివిధాలుగా కృషి చేసిందని మున్ముందు ఇంకా చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలగుండెల్లో నిలిచిపోయే విధంగా ప్రజలయొక్క అవసరాలు అనుగుణంగా మా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, డిఈ నవీన్, ఏఈ శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.