UPDATES  

 కొండెక్కిన కూరగాయల ధరలు కొనలేక లబోదిబోమంటున్న సామాన్యులు సామాన్యుడికి గుదిబండ

కొండెక్కిన కూరగాయల ధరలు కొనలేక లబోదిబోమంటున్న సామాన్యులు సామాన్యుడికి గుదిబండగా మారిన అధికధరలు పెరిగిన ధరలను అదుపుచేసి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయాలంటున్న ప్రజలు మన్యంన్యూస్,ఇల్లందు:పెరిగిన కూరగాయల ధరలతో పట్టణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నచందాన తయారైంది ఇల్లందులో ప్రస్తుత పరిస్థితి. నిత్యం వినియోగించే కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పట్టణంలో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలే ఎక్కువ. పెరిగిన కూరగాయల ధరలతో నేడు వారి పరిస్థితి మరింత కష్టంగా మారింది. వచ్చేకూలీ డబ్బులతో ఏ రోజుకారోజు పొట్టనింపుకునే వారికి ఈ అధిక ధరలు గుదిబండగా మారయనే చెప్పవచ్చు. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ వెలవెలబోతూ దర్శనమిస్తోంది. దాదాపు గత నెలరోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఉన్నట్టుండి కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. పట్టణంలో కిలో టమాటా రూ.180 ఉండగా గ్రామాల్లో 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇదేవిధంగా పచ్చిమిర్చి 160 రూపాయలు, ఆలుగడ్డ, దోసకాయ, బెండకాయ, కాకర, వంకాయ కురగాయల ధరలు సైతం దాదాపుగా 100 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేకపోతున్నారు. పచ్చళ్ళు, పెరుగులతోనే భోజనం చేస్తూ రోజు గడిపేస్తున్నారు. కూరగాయలు కొనలేక నిరుపేదలు గంజి తాగుతూ కాలం వెళ్లదీస్తున్నరు. కర్రీపాయింట్లలో సైతం యజమానులు కూరగాయల ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో పట్టణప్రజలు కర్రీపాయింట్లలో, మార్కెట్లో కూరగాయలు కొనేందుకు ఆసక్తి కనబరచడంలేదు. వాస్తవానికి కూరగాయల ధరలతో పోలిస్తే మాంసం ధరలే చౌకగా ఉండటంతో అధికశాతం ప్రజలు మాంసాహారంతోనే రోజు వెళ్లదీస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఈ విషయమై ప్రజాప్రతినిదులు సైతం ప్రజలపక్షాన నిలబడి కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్షణచర్యలు చేపట్టాలని, నిరుపేద, మధ్యతరగతి ప్రజలు కడుపునిండా భోజనం చేసేలా చూడాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !