– వీధి వ్యాపారుల ప్రాంగణం నిరుపయోగం
– మందుబాబులకు అడ్డా.. చెత్త డంపింగ్ యార్డ్ గా మారిన వైనం
– బిచ్చగాళ్లకు నిలయం.. బహిర్భూమికి ఉపయోగం
– వినియోగంలోకి వస్తే సరే.. లేకుంటే ప్రజాధనం గంగాపాలేనా?
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
లక్షలు పోసి కట్టారు.. లక్షణంగా వదిలేశారు.. ఇటు వార్డు కౌన్సిలర్ కు పట్టడం లేదు.. అటు మున్సిపాలిటీకి గిట్టడం లేదు.. ఈ సముదాయం ప్రస్తుతం మందుబాబులకు అడ్డగా… చెత్త డంపింగ్ యార్డ్ గా నిలుస్తోంది.. అంతేకాకుండా బిచ్చగాళ్లకు నిలయం.. బహిర్భూమికి ఉపయోగపడుతున్న వైనం.. పట్టించుకుంటే వినియోగంలోకి వస్తుంది… లేకుంటే ప్రజాధనం
గంగాపాలేనా..? అంటూ ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
వీధి వ్యాపారులకు స్వచ్ఛమైన వాతావరణంలో తమ వ్యాపారం చేసుకునేందుకు ఒక మంచి సదుపాయంతో పాటు మరుగుదొడ్లు సైతం నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన విషయం విధితమే. అయితే అన్ని రకాల సదుపాయాలతో నిర్మించిన ఈ వీధి వ్యాపారుల సముదాయం ఉండి ఉపయోగం లేకుండా ఉండడంతో విమర్శలకు తావిస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు కూలీ లైన్ ఏరియాలో పట్టణ ప్రగతి నిధుల కింద 35 లక్షల రూపాయలు కేటాయించి వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటు చేశారు. పూర్తయిన ఈ సముదాయాన్ని 28-8-2021న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు ఈ సముదాయాన్ని వినియోగంలోకి తేకపోవడం విచారకరం. నెలలు తరబడి నిరుపయోగంలో ఉండడం వల్ల ఇటు మందుబాబులకు అటు చెత్త వేసుకునేందుకు బహిర్భూమికి వెళ్లేందుకు నిలుస్తోంది. అంతేకాకుండా బిచ్చగాళ్లు సైతం సముదాయంలోని కొన్ని బ్లాకులను మూసివేసి అందులో తల దాచుకున్న పరిస్థితి నెలకొంది. మరికొందరు రోడ్డు పక్కనున్న వ్యాపారులు తమ పెద్ద పెద్ద కాళీ డబ్బాలను తీసుకువచ్చి ఈ ప్రాంగణంలో ఉంచడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ వీధి వ్యాపార ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే విషయంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ఆరోపణలు రావడం గమనించాల్సిన విషయం.