హైదరాబాద్
ఉద్యోగులకు పేస్కేల్ పెంచుతామని, దేశం ఆశ్చర్యపోయేలా పెంపు ఉంటుందని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ‘ ఓట్లకోసం ఎవరు ఏం అనుకుంటారో అని మేము భయపడం. కర్ణాటకలో ఎన్ని హామీలు ఇచ్చినా బీజేపీని తన్ని తరిమేశారు. రూ. 4 వేలు పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ అంటుంది. మేము రూ. 5 వేలు పెంచుతామని అంటాం..అలా చెప్పడం కాదు..చేయాలి. అందుకే మేము సాధ్యం అయ్యేదే చెబుతాం.. చేస్తాం. పెన్షన్లు కచ్చితంగా పెంచుతాం.. కానీ ఒకేసారి పెంచం. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇస్తోంది. చేయగలిగేది చెప్పాలి.. అలా కాని పక్షంలో ప్రజలు నమ్మరు. మా అమ్ముల పొదిలో ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. దేశంలో ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులు మాత్రమే. సింగరేణిని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీయే. అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కాంగ్రెస్ అమ్మేసింది. సింగరేణి కార్మికులకు వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పాలనలో ఐటి ఉద్యోగుల సంఖ్య 3లక్షలు, మా పాలనలో 6లక్షల 15వేలు’ అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.