- దద్దరిల్లిన తుడుం మోత
- కదం తొక్కిన ఆదివాసీలు
- ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 09, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా బుధవారం జూలూరుపాడు మండల కేంద్రం తుడుం మోతలతో దద్దరిల్లింది. మండల పరిధిలోని ఆదివాసీ మహిళలు, పిల్లలు, యువకులు, పెద్దలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులంతా మండల కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీగా బయలుదేరి తమ సంస్కృతి, సాంప్రదాయ కొమ్ము, తుడుం నృత్యాలతో మండల కేంద్రం దద్దరిల్లేలా కదం తొక్కారు. అనంతరం పాపకొల్లు క్రాస్ రోడ్డు కొమరం భీమ్ సెంటర్ నందు ప్రపంచ ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి, జై కొమరం భీమ్ జై జై కొమరం భీమ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఆనాడు కొమరం భీమ్ జెల్ జంగిల్ జమీన్ కోసం ఉద్యమించి పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసి, సాధించిన హక్కులను, చట్టాలను నేటి పాలకులు సక్రమంగా అమలు చెయ్యక, ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ, హక్కులను కాలరాస్తూ, ఆదివాసీలను అడవికి దూరం చేయాలని చూస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ ఆదివాసీ గ్రామాలలో నేటికీ కనీస మౌలిక వసతులు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 9 న సెలవు దినంగా ప్రకటించి, ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అధికారి బొర్రా తిరుపతయ్య, ఏఈ డబ్ల్యూసిఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోడియం బాలరాజు, జిల్లా అధ్యక్షుడు మేడికట్ల కృష్ణయ్య, సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తెల్లం నరసింహారావు దొర, నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి సంఘం నాగరాజు, ఏన్కూరు ఎంపీపీ అరెం వరలక్ష్మి, రామయ్య, మలకం సాములు, సర్పంచ్ కళాశ్రీ, వీరభద్రం, కొమరం భీమ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు సోడే శ్రీరామ్, మడి రవి, తెల్లం మహేష్, బచ్చల లక్ష్మయ్య, ముక్తి వెంకటేశ్వర్లు, సిద్దే బోయిన వెంకటేశ్వర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.