UPDATES  

 ఎన్నికలవేళ ఇల్లందులో కొత్త నాయకుల హడావిడి గతంలో వారిమొహాలు సైతం ప్రజలకు తెలియనివైనం నేడు

ఎన్నికలవేళ ఇల్లందులో కొత్త నాయకుల హడావిడి గతంలో వారిమొహాలు సైతం ప్రజలకు తెలియనివైనం నేడు మేముసైతం అంటూ నియోజకవర్గంలో పర్యటనలు పట్టించుకోని నియోజకవర్గ ప్రజలు మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇల్లందులో రాజకీయం కొత్తపుంతలు తొక్కుతోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు తాము కూడా పోటీలో ఉన్నామంటూ వారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం నాయకుల మధ్య తీవ్రపోటీ నెలకొని ఉంది. నాకంటే నాకే టికెట్ లభిస్తుందంటు తమ అనుచరవర్గానికి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అనూహ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకుల పరిస్తితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీలో చేరేందుకు ముందస్తుగానే జిల్లాలోని పదిస్థానాల్లో ఎనిమిది స్థానాలు తను నిర్ణయించిన అభ్యర్థులు, అనుచరులకే కేటాయించాలని పొంగులేటి కండీషన్ పెట్టినట్లు సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇల్లందులో కాంగ్రెస్ టికెట్ కోరం కనకయ్యకు ఇస్తే నేడు టికెట్ ఆశిస్తున్న నేతలు ఆయనకు మద్దతు తెలిపే పరిస్థితులు కానరావడం లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచి నియోజకవర్గ అభివృద్ధి పేరిట కాంగ్రెస్లో చేరిన కోరం కనకయ్య గత ఎన్నికల్లో పరాజయం పాలయినప్పటికీ అధికార పార్టీ జిల్లా జెడ్పీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టి సముచిత స్థానాన్ని కల్పించిందని, అధికార పార్టీలో ఏమి తక్కువయిందని కోరం పొంగులేటితో చేతులు కలిపారో నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని స్వలాభం కోసం పార్టీలు మారే కోరం తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తిరిగి కాంగ్రెస్ లో నేడు పోటీ చేస్తా అంటే మాత్రం కార్యకర్తలు, తాము అండగా నిలవబోమని టికెట్ ఆశించేనేతలు తమ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఏం జరగనుందొ మరికొన్ని నెలల్లో కాలమే నిర్ణయించనుంది. ఇల్లందులో కాంగ్రెస్ నుంచి పోటీలో దాదాపు పదిమంది వరకు ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి, టేకులపల్లి నుంచి దల్సింగ్ నాయక్ లు ప్రధానంగా పోటీలో ఉన్నారు. స్థానికేతరాలైన విజయలక్ష్మికి కానరాని ఆదరణ: ఇల్లందు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ప్రజలకు ముఖపరిచయం సైతం లేనటువంటి స్థానికేతురాలైన బానోత్ విజయలక్ష్మి కూడా పోటీలో నిలవటం గమనార్హం. విజయలక్ష్మి నియోజకవర్గ ప్రజలకు నయా నాయకురాలిగా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి మాత్రం ఆదరణ దక్కటంలేదు. కనీసం సొంత పార్టీనేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్లో ఇంతకాలం కష్టపడి పార్టీ ఎదుగుదలకు కృషిచేసిన నాయకులను కాదని నయా నాయకురాలైన విజయలక్ష్మిని ప్రజలు నమ్మే పరిస్థితిలేదని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెయిడ్ ప్రచారం చేసుకుంటూ ఆదరణ ఉందని చెప్తే సరిపోదని, అటువంటి నాయకులకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయని, నయా నాయకులు ఎన్నికలనాడు తమ స్వలాభం కోసం చేసే రాజకీయ ఎత్తుగడలుగా ప్రజలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. హరిప్రియ పాలనకే ప్రజల మొగ్గు:ఎవరెన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ఇల్లందు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఘనత మాత్రం స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కే దక్కిందని చెప్పాలి. కాంగ్రెస్ నుంచి హరిప్రియ గెలిచి అభివృద్ది కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 1600 కోట్ల రూపాయల నిధులతో ఇల్లందు నియోజకవర్గాన్ని హరిప్రియ నాయక్ అభివృద్ధిపథంలో నడిపించారు. గతంలో కొందరు నాయకులలాగా స్వలాభం కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ది, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నిరంతరం కష్టపడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకురాలు హరిప్రియ నాయక్. విద్యావంతురాలైన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే జరిగే అభివృద్ధికి తార్కాణంగా హరిప్రియ నిలిచారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనులు, ప్రజల ఆశ్శీస్సులే రానున్న ఎన్నికల్లో హరిప్రియ నాయక్ గెలుపుకు శ్రీరామరక్ష అని, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికుట్రలు చేసినప్పటికీ వారి పాచికలు పారే పరిస్థితులు లేవని, హరిప్రియ గెలుపును ఎవరూ ఆపలేరని నిస్వార్థ రాజకీయాలు చేసే హరిప్రియ గెలుపు లాంఛనం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రత్యర్ధులపై హరిప్రియ ఏస్థాయి విజయం స్తాధిస్తారో వేచిచూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !