వెస్టిండీస్ (West indies)తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) సమం చేసింది. తొలి రెండు టి20ల్లోనూ ఓడిన టీమిండియా..
మూడో టి20లో నెగ్గింది. ఇక శనివారం జరిగిన నాలుగో టి20లోనూ అదిరిపోయే విక్టరీని అందుకుంది. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 00 ఓవర్లలో వికెట్ నష్టపోయి టార్గెట్ ను ఛేదించేసింది. టీమిండియా చిచ్చర పిడుగు యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. శుబ్ మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అలరించాడు. వీరిద్దరు చెలరేగి పోవడంతో భారత్ చెమట పట్టుకుండా విజయాన్ని అందుకుంది. ఇక సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 ఆదివారం ఇదే గ్రౌండ్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.
రాణించిన ఓపెనర్లు
గత మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ టి20ల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇక ఈ టి20 సిరీస్ లో శుబ్ మన్ గిల్ ఇప్పటి వరకు సరిగ్గా ఆడింది లేదు. ఈ క్రమంలో వీరిద్దరికీ నాలుగో టి20 అత్యంత కీలకంగా మారింది. ఈ దశలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్, గిల్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతి బ్యాట్ పైకి వస్తుండటంతో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జైస్వాల్ తొలి బంతి నుంచే అటాకింగ్ ఆటతో విండీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన గిల్.. అనంతరం దూకుడు పెంచాడు. ఈ క్రమంలో ఇరువురు కూడా అర్ధ సెంచరీలను అందుకున్నారు. గెలుపునకు చేరువగా వచ్చిన తర్వాత గిల్ అవుటయ్యాడు. దాంతో 165 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం తిలక్ వర్మ (7 నాటౌట్)తో కలిసి జైస్వాల్ మ్యాచ్ ను ముగించేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్ మైర్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న షై హోప్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. దాంతో వెస్టిండీస్ భారీ స్కోరును అందుకుంది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు సాధించాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్ లకు తలా ఒక వికెట్ లభించింది.