మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 14, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి జిల్లా కమిటీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఆజాది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేదవారికి విద్యా, వైద్యం, ఉద్యోగం వంటివి దరి చేరలేదని అన్నారు. మరో స్వతంత్ర పోరాటానికి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖుదేవ్, అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అమర వీరుల స్ఫూర్తితో నేటి యువత నిజమైన స్వతంత్రం కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకు మణిపూర్ ఘటనలే సాక్ష్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రానికి ముందు ఆంగ్లేయులు మన సంపదను, శ్రమను దోసుకుంటే, నేడు స్వదేశీ పాలకులు అదే విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని రూపుమాపి, దేశంలోనీ ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందించడానికి స్వదేశీ పాలకులపై మరో పోరాటం చేయడానికి విద్యార్థులంతా సన్నద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు బోడా అభిమిత్ర, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వల్లమల్ల చందర్రావు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పవన్, అనిల్, సంతోష్, భరత్ వికాస్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.