మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ప్రభుత్వ ఉద్యోగి పై దాడి చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి.భానుమతి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కూలిలైన్ నివాసి పోలే వీరస్వామి వాచ్మెన్ డ్యూటీలో ఉండగా 2017 ఫిబ్రవరి 23న 108 సిబ్బంది ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ హాస్పిటల్ రూమ్ లో పడుకోబెట్టగా అతనికి ఎడమ చేతిని మోచేతి కింద బలమైన దెబ్బలు తగలడం వలన డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ పద్మావతి అతనికి చికిత్స చేయుటకు ప్రయత్నించగా అసబ్యoగా ప్రవర్తిస్తూ బండబూతులు తిడుతూ నన్నెందుకు తీసుకొని వచ్చారని ఆమెపై దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న వాచ్మన్ వీరస్వామి అడ్డుకొని ఆపగా తనని కూడా బండ బూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తూ నెట్టి వేయగా కిందపడగా ఎడమ భుజం ఎముక విరిగింది. దాడి చేసిన వ్యక్తి పేరు తెలుసుకొనగా లక్ష్మీదేవిపల్లి మండల సంజయ్ నగర్ చెందిన బుర్ర విజయని
తెలియడంతో అతనిపై కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ కే.అంజయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాడు. కోర్టులో ఏడుగురు సాక్షులను విచారించారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి బుర్ర విజయ్ ని దోషిగా భావిస్తూ భారత శిక్షాస్మృతి సెక్షన్ 294 బి ప్రకారం ఒక నెల సాధారణ శిక్ష 200 రూపాయల జరిమానా, 333 ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా, 506 ప్రకారము ఒక సంవత్సరం జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.