మన్యం న్యూస్,ఇల్లందు:గృహలక్ష్మి పేరిట నూతన గృహనిర్మాణ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సొంత జాగా ఉండి ఇల్లులేని నిరుపేదలకు ఈ పథకం వర్తించనున్నది. గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మానాలకు మూడులక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం అందించనుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ మార్గదర్శకాలను వార్డ్ ఆఫీసర్లకి తెలియజేయుటకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారికి గృహలక్ష్మి పథకానికి సంబంధించిన విధివిధానాలు తెలియజేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, తహశీల్దార్ రవికుమార్లు మాట్లాడుతూ..ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచన మేరకు మున్సిపల్ కౌన్సిలర్ల సహకారంతో నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ రూపొందించిన గృహలక్ష్మి పథకం ఎంతో గొప్పదని, నిరుపేదలకు వరం అని కొనియాడారు. ఈ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొను లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రం, ఖాళీ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, ఆధార్, రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఇంటికి సర్వేకి వచ్చిన వార్డ్ ఆఫీసర్లకు ఆ పత్రాలన్నింటిని చూపెట్టాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రం లేనిచో వెంటనే అప్లై చేసి మా వద్దకు పట్టుకొస్తే ఒక్కరోజులో ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, ఎంపీడీవో, డిఈ నవీన్, వార్డ్ ఆఫీసర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.