మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల లాభాల బోనస్ సింగరేణి సంస్థ చెల్లింపు చేయనుందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్ తెలిపారు. మంగళవారం సింగరేణి భవన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని సింగరేణి అభివృద్ధి లాభాల బోనస్ పై వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో గత 9 సంవత్సరాల్లో దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని టర్నోవర్ ను, లాభాలను గడించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాక పూర్వం 2013-14 లో కేవలం 419 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే సాధించిన సింగరేణి గత ఏడాది 2,222 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందన్నారు. అలాగే తెలంగాణ రాక ముందు సంవత్సరం కార్మికులకు 83 కోట్ల రూపాయలను లాభాల బోనస్‌గా చెల్లించగా ఈ ఏడాది 700 కోట్ల రూపాయల లాభాల బోనస్‌ను త్వరలోనే కార్మికులకు చెల్లించబోతున్నామన్నారు.