- వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
- ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
- పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అనేక పథకాలు
- అభివృద్ధిలో నెంబర్ వన్ గా తెలంగాణ
- ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అనేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందని.. అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ప్రగతి మైదానంలో మంగళవారం జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేళ్ల కాలంలో సాధించిన ప్రగతి ఎంతో ఉందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగాని అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీ ఉద్యాన పంటల సాగు జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతు బంధుతో రైతులకు ఎంతో భరోసా కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతుకు సంవత్సరానికి వ్యవసాయ పెట్టుబడి లభిస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు ద్వారా రైతులు ఎంతో అభివృద్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. పామాయిల్ ఒకసారి పంట సాగు చేస్తే ఏళ్ల తరబడి పంట ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధరణి సేవలు ఫలితంగా దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం జరిగిందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చడానికి 13వేల 58 కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు చెప్పారు.
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్ శాఖల ద్వారా ఇతర సహకార శాఖల ద్వారా చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని రెండు లక్షల 74 వేల 912 మంది ఆహార భద్రత కార్డుదారులకు 18,734 అంథోదయ కార్డుదారులకు 3 అన్నపూర్ణ కార్డులకు 8లక్షల 43,923 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో 12,300 మంది నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 86,773 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అర్హులైన వారందరికీ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. పోడు సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ సభల నిర్వహణ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన 50వేల 595 మంది పోడు దారులకు హక్కు పత్రాలు జారీ చేశామన్నారు. కొత్తగా పట్టాలు పొందిన వారికి బ్యాంకు ఖాతాల ద్వారా వానాకాలం పంట సాగుకు 10 కోట్ల 65 లక్షలు రైతు బంధు నిధులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమం కోసం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో విద్యాశాఖకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మన ఊరు మనబడి ద్వారా విద్యార్థుల ఆసక్తికి తగ్గ విద్యాబోధన జరిగేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పాటును ఇస్తుందన్నారు. ఎంపిక చేసినటువంటి 368 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు ఇప్పటివరకు 41 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతను తీసుకు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొని జిల్లా కీర్తిని దేశస్థాయిలో ఇనుమటింప చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు కిందిస్థాయి వరకు ప్రజలకు అందే విధంగా తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మారుమూల గ్రామాల నిరుపేదలకు అధికంగా నివసిస్తున్న మన జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అధికారులకు సిబ్బందికి రేగా కాంతారావు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి, ఇతర శాఖల చెందిన అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు సిబ్బందికి రేగా కాంతారావు ప్రశంస పత్రాలను అందజేశారు.