మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు నిర్వహించిన దశలవారీ ఆందోళనలు, పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంవల్లే రెండో ఏఎన్ఎంలు నిరవధిక సమ్మె పోరాటానికి పూనుకోవాల్సివచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ స్పష్టం చేశారు. క్రమబద్దీకరణ, ప్రభుత్వం జారీచేసిన ఉద్యోగ ప్రకటన మార్పు ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్ఎంలు బుధవారం నుంచి విధులు భాస్కరించి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. సమ్మె ప్రారంభం సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన శిభిరం ప్రారంభించారు. శిభిరాన్ని ప్రారంభించిన అనంతరం నరాటి ప్రసాద్ మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా ద్వితీయ శ్రేణి ఏఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్నారన్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించారని అనేక మంది సిబ్బంది కరోనా భారిన పడి మత్యువాతపడ్డారన్నారు. ఇలాంటి రెండో ఎన్ఎంలు తమను క్రమబద్దీకరించాలని, భీమా సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోగా ఉద్యమాలని అణచివేసే కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు బల్లా సాయికుమార్, వేల్పుల మల్లికార్జున్, ఎండి యూసుఫ్, రెండో ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎండి.సజ్జు బేగం, ప్రధాన కార్యదర్శి బానోత్ ప్రియాంక, జిల్లా నాయకులూ కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.