మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
కొత్తగూడెంలో మూడు కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పడం వింతగా ఉందని అభివృద్ధి జరిగితే ప్రజలు త్రాగునీటి కోసం ఎందుకు తండ్లాడుకుంటున్నారని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నాలేరియాలో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో టికెట్ విషయమై రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయని హడావిడిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నెలలో పదిసార్లు ఏదో ఒక సమావేశం నిర్వహించడం తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తానే పోటీలో ఉన్నానని చెప్పుకోవడం చూస్తుంటే సిగ్గేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో 3 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన త్రాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నుండి కామిషన్ల కోసమే పనులు ప్రారంభిస్తున్నారు తప్ప అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, సాయి, జిల్లా కార్యదర్శులు చెనిగారపు నిరంజన్ కుమార్, మాలోత్ వీరు నాయక్, జర్పుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.