మన్యం న్యూస్,ఇల్లందు: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబిఎస్ లో జరిగిన దొంగతనంకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కోశాధికారి జె గణేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారుల చిన్నచూపు మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా, తదితర ప్రజాసంఘాలు రావద్దని నిషేధాల మీదపెట్టే దృష్టి పాఠశాలల సమస్యపై పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని, ప్రైవేటు పాఠశాలల కమీషన్లకు కక్కుర్తి పడి ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇన్చార్జి ఎంఈఓల పాలన నడుస్తుందని, పర్మినెంట్ ఎంఈఓలు లేక సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని పేర్కొన్నారు. జేబీఎస్ పాఠశాల నందు అనేక సమస్యలు నెలకొని ఉన్నా పట్టించుకునే వారేలేరని టాయిలెట్స్ లేక విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా టాయిలెట్స్ నిర్మించడం లేదని ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలకు ఒక వాచ్మెన్ నియమించకపోవడం దురదృష్టకరం అన్నారు. వాచ్మెన్ నియమించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, విద్యాశాఖ ధనం వృధా అవ్వటం, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తప్ప ఇందులో మరోటి లేదని పేర్కొన్నారు. పాఠశాలలో దొంగతనం చేసిన దోషలను శిక్షించి పాఠశాల సమస్యలపై ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని ఆయన తెలిపారు.