విద్యాలయాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్ ప్రియాంక
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల మరమ్మత్తు పనులను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి మినీ సమావేశపు హాలులో మన ఊరు మనబడి పనుల ప్రగతిపై డిఆర్డీఓ, విద్యా, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలను తాను తనిఖీ చేస్తానని పనుల్లో నాణ్యతలేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దే పాఠశాలలు పచ్చని చెట్లు లాన్ తో ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పారు. మండల వారిగా పనుల పురోగతిని
సమీక్షించిన కలెక్టర్ పనులు నత్తనడక జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. ఎంఈఓలు పాఠశాలలను తనిఖీ చేస్తూ పనులు పూర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, పర్యవేక్షణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.