మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ఎమ్మెల్సీ తాత మధుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడం లేదని విద్యార్థులు తాత మధు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహం పూర్తిగా శిథిలావస్థలో ఉందని అది ఎప్పుడు కులుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాలేజీకి అంబులెన్స్ సౌకర్యం కూడా లేదన్నారు. రాత్రి సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కళాశాల కళకళలాడేదన్నారు. నేడు అదే కళాశాల వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు కొత్త భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఎమ్మెల్సీ తాత మధుకు విజ్ఞప్తి చేశారు.