మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:ఆత్మ గౌరవం కోసం ఎన్నికల్లో నిలబడతా అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాదు నుండి ఖమ్మం రూరల్ మండలానికి శుక్రవారం విచ్చేసిన ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన అభిమానులు సుమారు 3వేల పైచిలుకు కార్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.
పాలేరు, వైరా, లంకా సాగర్, బేతుపల్లి ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు నింపి మీ వద్ద సెలవు తీసుకుంటాను.. అధికారం, అహంకారం, అనుభవం కోసం నాకు పదవి అవసరం లేదు.. ఆత్మ గౌరవం కోసం ఎన్నికల్లో నిలబడతా. ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది.. సుదీర్ఘ రాజకీయ అవకాశాలు ఇచ్చారు.. నన్ను రాజకీయంగా మీరే బ్రతికించారు.. మీ ప్రేమ కోసం గోదావరి జలాలు వచ్చే వరకు శాసనసభ్యుడుగా ఉంటాను. రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, మీ అభిమానం చూసిన తర్వాత జిల్లా కోసం రాజకీయాల్లో ఉండాలని అనుకున్నాను.. మీ బిడ్డగా పది నియోజకవర్గాల్లో అభివృధ్ది కోసం నా నిర్ణయం మార్చుకున్నాను. ఈ తుమ్మల వల్ల ఎవడైనా తల వంచుకునే పరిస్థితి వస్తే నా తల తెంచుకుంటా అని స్పష్టం చేశారు. తుమ్మల మాటలతో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.
