మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
దళితబంధు పథకానికి వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక దళితబందు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి మిని సమావేశపు హాలులో దళితబంధు రెండవ విడత దరఖాస్తులు పరిశీలన మొదటి విడత ఏర్పాటు చేసిన యూనిట్లు నిర్వహణ తదితర అంశాలపై నియోజక ప్రత్యేక అధికారులు సెక్టార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు రెండవ విడతలో నియోజకవర్గానికి 1100 మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3310 దరఖాస్తులు వచ్చాయని వచ్చిన దరఖాస్తులు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని చెప్పారు. విచారణ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పారు. దళితుల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని చేపట్టినట్లు చెప్పారు.
యూనిట్లు ఎంపికలో సెక్టార్ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి అనుభవం ఉన్న రంగాలను ఎంచుకోవాలని చెప్పారు. మొదటి విడతలో జిల్లాలో 421 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యూనిట్లు నిర్వహణను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపిడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మండల మున్సిపల్ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిటిలు యూనిట్లు నిర్వహణ తీరును పర్యవేక్షణ చేస్తూ లబ్దిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, ఎస్సీ కార్పోరేషన్ ఈడి సంజీవరావు, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు అర్జున్, జినుగు మరియన్న, ఎన్ వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, సీతారాం, పశుసంవర్ధక శాఖ డిడి పురందర్,
మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.