UPDATES  

 ఇష్టపడి చదవండి భవిష్యత్తు మీదే * విద్యార్థులకు కలెక్టర్ ప్రియాంక సూచన

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వైద్యవిద్యలో శ్రద్ధగా రాణించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్య విద్యార్ధులకు సూచించారు. శుక్రవారం వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్య విద్యను ఎంచుకోవడం పట్ల అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. విద్యార్థులు డిసెక్షన్ చేస్తున్న అనాటమి ల్యాబ్ పరిశీలించారు. కళాశాల పచ్చని చెట్లుతో ఆహ్లాదకరంగా ఉండాలని ఖాళీగా స్థలంలో విరివిగా చెట్లు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కళాశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల హాజరు వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్ రావును అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో మొత్తం 150 సీట్లున్నాయని, గత సంవత్సరం నుండి కళాశాల ప్రారంభమైందని, 149 మంది విద్యార్థులు చేరినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వీరిలో బాలురు 62, బాలికలు 87 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో 107 మంది విద్యార్థులకు మొదటి విడతలో సీట్లు కేటాయింపు జరిగినట్లు చెప్పారు. అడ్మిషన్లు జరుగుతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ కు సూచించారు. అనంతరం వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిని ఆర్ అండ్ బీ ఈఈ భీంలాను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని నాణ్యత పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, ఆర్ అండ్ బీ ఈఈ భీంలా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఈ మురళి, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !