గోదావరి ముంపుబాధితులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించండి
సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు షేక్ యాకుబ్ షావలి
మన్యం న్యూస్,ఇల్లందు:చర్ల మండల గోదావరి ముంపు బాధితులకు ఐదుసెంట్ల ఇంటిస్థలాన్ని వెంటనే ఇవ్వాలని, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఇల్లందు పట్టణ, మండల కమిటీల కార్యదర్శులు షేక్ యాకుబ్ షావలి, కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్లన్న మెమొరీయల్ ట్రస్టు భవనంలో ప్రజాపంథా పార్టీ ముఖ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. గోదావరి ముంపుబాధితులపై పోలీసుల దౌర్జన్యాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు. గోదావరి ముంపు బాధితులు అనేకసార్లు తమ గోడును అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో విసిగిపోయిన ముంపు బాధితులు వారే ఒక మెరకప్రాంతాన్ని చూసుకుని గుడిసెలు నిర్మించుకుంటుంటే వారికి సహకరించి హక్కులు కల్పించవలసిన ప్రభుత్వం ఆ స్థలాన్ని సిఆర్పిఎఫ్ క్యాంప్ కార్యాలయాలకు కేటాయించామని, ముంపుబాధితులపై పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం దుర్మార్గమన్నారు. ప్రజలు గోదావరిలో మునిగిన తర్వాత ఎవరిని రక్షించడానికి సిఆర్పిఎఫ్ క్యాంపు కార్యాలయాలు కడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముంపు బాధితులపై దౌర్జన్యాలు మానుకొని ఆ స్థలంలో గోదావరి ముంపు బాధితులు అందరికీ ప్రతి కుటుంబానికి ఐదుసెంట్ల ఇంటిస్థలం కేటాయించాలని, సిఆర్పిఎఫ్ కార్యాలయాలకు వేరే స్థలం కేటాయించాలని, లేదా ముంపు బాధితులు అందరికీ తక్షణమే వేరే స్థలమైనా చూయించి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, శేషయ్య, పిల్లి మల్లేష్, వేముల గురునాథం, ఎస్ డి రంజాన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.