మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి మినీ సమావేశపు హాలులో ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, ఎలక్ట్రో లిటరసీ క్లబ్స్ నిర్వహణ, బూతు స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు అప్ డేట్ చేయుట, స్వీప్ కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27 తేదీన, వచ్చే నెల 2, 3 తేదీల్లో జరుగనున్న ప్రత్యేక క్యాంపులు నిర్వహణపై గ్రామాలు, పట్టణాలల్లో ప్రజలకు తెలియచేసేందుకు టామ్ టామ్ వేయించాలని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా వారి వారి ఓటును పరిశీలించుకునే విధంగా సమాచారం క్షేత్రస్థాయికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గాలల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ రాంబాబు, డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, డిఆర్వో రవీంద్ర బాబు, ఎస్డీసి కాశయ్య, భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.