మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు.
సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, డిఆర్డీఓ మధుసూదన్ రాజులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లో నిర్వహించే వేడుకల ముగింపు కార్యక్రమానికి జిల్లా నుంచి హాజరయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జడ్పి సీఈఓకు సూచించారు. వృద్దాప్య, ఆసరా ఫించను దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులను మూడు రోజుల్లో మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం క్రింద మన జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇదే రితీలో త్వరితగతిన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బీసిలకు కులవృత్తుల కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశలో మంజూరైన చెక్కుల పంపిణీ పూర్తయి నందున రెండవ దశ అమలుకు చర్యలు తీసుకోవాలని రెండవ విడత లో ఆన్ లైన్ లో మాత్రమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పి సీఈఓ విద్యాలత, ఎస్సి కార్పొరేషన్ ఈ డి సంజీవరావు, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పశు సంవర్ధక శాఖ డిడి పురందర్, భద్రాచలం ఆర్డిఓ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.