యూనివర్సిటీ “మైనింగ్” కళాశాల భూమి హాంఫట్!
* ఇప్పటికే 32 ఎకరాల స్థలం “కబ్జా” పర్వం
* గత పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం
* కాలేజీ చుట్టూ ప్రహరీ నిర్మించాలని డిమాండ్
* ఆస్తులకు “రక్షణ” కల్పించాలని విద్యార్థుల వేడుకోలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేసే కాలేజీకి రక్షణ కరువైంది.. కళాశాలకు ఎకరాల కొద్ది భూమి ఉంది.. అయితే అట్టి భూమికి చుట్టూ ప్రహరీ లేదు.. దీంతో దశలవారీగా ఆ భూమి కబ్జాకు గురైంది.. ఇటు కాలేజీ ఆస్తులు ఆక్రమణకు గురి కావడంతో పాటుగా అటు చెదలు పట్టడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.. అంతేకాకుండా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉండడం ఎంతో గర్వకారణం. 1976లో మైనింగ్ కోర్స్ కేవలం 27 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల దశలవారీగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1995లో సిఎస్సిఈ, ఈఈఈ కోర్సులు ఉండగా 2011 సంవత్సరంలో ఈసీఈ, ఐటి కోర్సులు రావడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఐదు కోర్సులతో ఇంజనీరింగ్ మైనింగ్ కళాశాల ముందుకు పోతుంది. మైనింగ్ కోర్స్ తో మొదలై మైనింగ్ కళాశాలగా ముద్ర వేసుకున్న కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల 390 ఎకారాలలో విస్తీర్ణంలో కలిగి ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో అభివృద్ధిలో భాగంగా కాలేజీకి ఉన్న 390 ఎకరాల్లో మెడికల్ కాలేజీకి 30 ఎకరాలు, కలెక్టర్ కార్యాలయంకు 25 ఎకరాలు, ఎస్పీ కార్యాలయంకు 25 ఎకరాలను కాలేజీ ఆధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కాలేజీ భూమిని ఒక ప్రైవేట్ ఇండస్ట్రీస్ కంపెనీ సుమారు 32 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. స్థలం కబ్జాపై గత పాలకులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని యాజమాన్యం పేర్కొంది. యూనివర్సిటీ కాలేజీకి చుట్టూ ప్రహరీ లేని కారణంగానే ఆస్తులు ఆక్రమణల పాలవుతున్నాయని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మిగిలి ఉన్న 278 ఎకరాల భూమికైనా రక్షణ కల్పించడంతోపాటుగా కబ్జా చేరాల్లో ఉన్న భూమిని సైతం తమ కాలేజీకి దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యాజమాన్యం విజ్ఞప్తి చేయడం గమనించాల్సిన విషయం.
ఆస్తులకు రక్షణ లేదు: ప్రిన్సిపల్ పున్నం చందర్
మైనింగ్ కళాశాలగా ముద్ర వేసుకున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన ఆస్తులకు రక్షణ లేదని కళాశాల ప్రిన్సిపాల్ పున్నం చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి. ల్యాబ్ లను ఆధునికరించాలి. విద్యార్థులకు కంప్యూటర్లు అవసరం ఉన్నది. తరగతి గదులను ఏర్పాటు చేయాలి. కళాశాలకు కావలసిన మరుగుదొడ్లతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
