ఇంజనీరింగ్ కళాశాలకు సుస్థి!
* కనీస సౌకర్యాలు కరువు
* శిథిలావస్థలో హాస్టల్ భవనం
* వర్షం వస్తే..కురుసుడే
* మసకబారిన ల్యాబ్ ల గదులు
* చుట్టూ చెదారం అపరిశుభ్రం
* రాత్రి అయితే బుసలు కొడుతున్న విష సర్పాలు
* బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్న విద్యార్థిని విద్యార్థులు
* సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ తాతా మధుకు వినతి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఒకప్పుడు టాప్ లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నేడు కునారిల్లుతుంది.. అనేక సంవత్సరాలుగా ఈ కళాశాలకు సమస్యలు పేరుకుపోయి సుస్థి చేసింది.. ఈ సరస్వతి నిలయానికి చికిత్స చేసే నాధుడే కరువయ్యాడు.. సమస్యను గత పాలకుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.. ఇక చేసేదేమీ లేక విద్యార్థిని విద్యార్థులు
అవస్థల నడుమనే బోధన సాగించాల్సిన దుస్థితి నెలకొంది.. ఇటీవల మరల విద్యార్థిని విద్యార్థులు ఎమ్మెల్సీ తాత మధుకి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన విషయం తెలిసింది.
భద్రాద్రి జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థిని విద్యార్థులు పలుమార్లు గత పాలకులకు విజ్ఞప్తి చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
విసిగి వేసారి పోయిన విద్యార్థులు అవస్థల మధ్యనే తమ బోధన సాగించుకుంటూ కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 900 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు వివిధ కోర్సులలో విద్యా బోధన చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి చదువుతున్న వారికి బాయ్స్ గర్ల్స్ కి హాస్టల్ సదుపాయం సైతం ఉంది. 1985 సంవత్సరంలో బాయ్స్ హాస్టల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉండడం వల్ల వర్షాకాలం వస్తే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా వంటశాల, విద్యార్థుల భోజనశాల భవనం కూడా కూలిపోయే దశలో ఉంది. బిక్కు బిక్కు మంటూ విద్యార్థులు రోజులు గడపాల్సిన పరిస్థితి ఉన్న పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులకు సంబంధించిన ల్యాబ్ ల గదులు మసకబారి కనబడుతున్నాయి. కళాశాల ప్రాంగణం మొత్తం పిచ్చి చెట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తుంది. రాత్రి అయితే చెట్ల పొదల నుండి విష సర్పాలు బయటికి వచ్చి బుసలు కొడతాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు దినదిన గండంగా తమ కళాశాలలో చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ తాత మధుకు సమస్యలపై వినతి…
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థిని విద్యార్థులు ఇటీవల ఎమ్మెల్సీ తాత మధుకు వినతిపత్రం అందించారు.