మన్యం న్యూస్ దుమ్మగూడెం ఆగస్టు 29::
మండలంలో రహదారుల వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు కనుబుద్ది దేవా డిమాండ్ చేశారు. మంగళవారం పెద్ద నల్లబల్లి గ్రామంలో జరిగిన ప్రత్యేక సమావేశం లో ఆయన మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే పర్ణశాల రహదారి మార్గంలో ఇసుక లారీలను అనుమతించకుండా చూడాలని, ఇసుక లారీల కారణంగానే రహదారులు ధ్వంసం అవుతున్నాయని అన్నారు. మండలంలోని నరసాపురం,తూరుబాక, ములకపాడు ప్రాంతాలలో రహదారులు ధ్వంసమై ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అన్నారు. రహదారులు కొద్దిమేర ధ్వంసం అయినప్పుడే అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఉంటే నరసాపురం గ్రామంలో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని ఓ విద్యార్థి వికలాంగుడు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేకల నరేంద్ర,నాని, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.