మన్యంన్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జాతీయ తెలుగుభాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసారు. తెలుగుభాష ప్రాచీనత, వైభవం, విశిష్టత కోసం ఎందరో మహానుభావులు కృషి చేసినప్పటికీ వ్యవహారిక భాషకోసం నడుంబిగించిన విద్యావంతుడు అయిన గొప్పరచయిత గిడుగు వెంకటరామమూర్తి చేసినటువంటి కృషిని స్మరించుకోవడమే మనం ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇచ్చే కృతజ్ఞత అని ఆమె తెలిపారు. అనంతరం తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. తెలుగుభాష కమ్మనైన భాష అని, నుడికారాల మధురమైన భాష అని తెలుగులో మాట్లాడదాం తెలుగుభాషను కాపాడుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో భాషలు ఒకదశలో గొప్ప ప్రభావాన్ని కలిగినప్పటికీ తర్వాత వాటిని విస్మరించడం వలన అవి మృతభాషలుగా మారుతున్నాయని ప్రతిఒక్కరూ భాషాభిమానం కలిగి ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్. బిందుశ్రీ, కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, అకడెమిక్ కో-ఆర్డినేటర్ శేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, ఇంద్రాణి, సురేంద్రకుమార్, ఈశ్వర్, రాజు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
