మన్యం న్యూస్ చండ్రుగొండ సెప్టెంబర్ 04 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన గర్భిణీకి నార్మల్ డెలివరీ చేయాలని వైద్య సిబ్బంది ప్రయత్నించడంతో శిశువు మృతి చెందిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యుల ,గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బెండలపాడు గ్రామానికి చెందిన పద్దం లావణ్య గర్భిణి ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులతో ప్రభుత్వాసుపత్రికి వచ్చింది.సోమవారం ఉదయం నొప్పులు రావడంతో వైద్య సిబ్బంది డెలివరీ (నార్మల్) ప్రయత్నించడంతో శిశువు (మగ) మృతి చెందింది. దీంతో ఆవేశానికి లోనైనా గర్భిని బంధువులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ కనకం తనూజ అక్కడికి వచ్చి పరిస్థితిని సద్దుమణిగించారు. డెలివరీ సమయంలో కొత్తగూడెం తరలించాలని గర్భిణీ తరుపు బంధువులు వైద్య సిబ్బందిని వేడుకున్న తరలించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ సమయంలో వైద్యురాలు స్థానికంగా లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తనుజ వివరణ కోరగా….. డెలివరీ కి ముందు స్కానింగ్ రిపోర్ట్ లన్ని సాధారణంగానే ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవుతుందని ఊహించాము. నూటికి ఓ కేసు (కాన్పు) ఇలా జరుగుతుందని, మా తప్పేం లేదని అన్నారు.





